WAQF BILL

కొన్ని నెలలుగా మాటల మంటలు రేపిన వక్ఫ్‌ బిల్లు చట్టంగా మారింది. ఏప్రిల్‌ 4న లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చ అనంతరం బిల్లు నెగ్గింది. లోక్‌సభలో 288-232, రాజ్యసభలో 128-95 ఓట్ల తేడాతో బిల్లు గట్టెక్కింది. తాజాగా రాష్ట్రపతి కూడా ఆమోదించడంతో ఆ బిల్లు చట్టంగా మారింది. ఈ మేరకు ఏప్రిల్‌ 8న కేంద్రం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. వక్ఫ్ సవరణ చట్టం ద్వారా వక్ఫ్‌ ఆస్తుల దోపిడీని అరికడతామని కేంద్రం ప్రకటించింది. దీని ద్వారా పారదర్శకత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 

 

అసలు.. వక్ఫ్‌ చట్టం అంటే ఏమిటి..? బీజేపీ ఎందుకు దీనిపై ఫోకస్‌ చేసింది..? ముస్లిం సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి..? ఇప్పుడు అందరిలోనూ ఇవే అనుమానాలు..! మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1954లో ఈ వక్ఫ్‌ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ తర్వాత పలుమార్లు ఈ చట్టానికి సవరణలు కూడా జరిగాయి. మొదటి సారి 1995లో వక్ఫ్ చట్టాన్ని సవరించిన నాటి సర్కార్.. వారికి మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. ఇందులో వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాలను కల్పించారు. ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాల్‌ చేయలేని విధంగా.. ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునేలా ప్రత్యేక అధికారాలు కల్పించారు. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్‌ బోర్డులు ఉన్నాయి. 

 

అయితే తమిళనాడులోని వక్ఫ్‌ బోర్డు ఈ మధ్య కాలంలో ఒక గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించటంతో ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది.వక్ఫ్‌ చట్టం విషయంలో మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీజేపీ.. ఈ చట్టంలో సవరణలు చేయాలని భావించింది. నిజానికి.. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేల తర్వాత మన దేశంలో అతి ఎక్కువగా భూములు ఉన్నది వక్ఫ్ బోర్డుకే. ఈ నేపథ్యంలోనే వక్ఫ్‌ బోర్డుకు విస్తృత అధికారాలను గత ప్రభుత్వాలు కట్టబెట్టాయని బీజేపీ ఆరోపిస్తోంది. 2009 తర్వాత వక్ఫ్ బోర్డు ఆస్తులు రెట్టింపు అయ్యాయని ముసాయిదా బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు, అఖారా, ట్రస్ట్‌లు, సొసైటీలకు లేని అపరిమిత అధికారాలు, స్వతంత్ర హోదాను వక్ఫ్‌ బోర్డులకు కట్టబెట్టారని వెల్లడించింది. వీటిని సవరించాల్సిన అవసరం ఉందంటూ పలు ప్రతిపాదనలను బిల్లులో వివరించింది కేంద్ర ప్రభుత్వం. వక్ఫ్‌ చట్టంలో సవరణలు చేస్తేనే నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుందని వెల్లడించింది మోదీ సర్కార్‌. దీంతో ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదింపజేసి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా సెంట్రల్‌, స్టేట్‌ వక్ఫ్‌ బోర్డుల్లో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిథ్యం కల్పించేలా సవరణలు కూడా చేసింది. వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. వక్ఫ్‌ బోర్డులు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించటం ద్వారా పలు వివాదాలు, అధికార దుర్వినియోగానికి కారణం అవుతున్నాయని తెలిపిన కేంద్రం.. ప్రస్తుత చట్టం ద్వారా ఏ ఆస్తిని వారు స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవని వెల్లడించింది.

 

వక్ఫ్ బిల్లులో పలు కీలక అంశాలను పొందుపర్చింది కేంద్రంలోని బీజేపీ సర్కార్‌. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను చేర్చాలని సవరణ చేసింది. దీని వల్ల నిర్ణయాలు పారదర్శకంగా ఉంటాయని ప్రకటించింది. ఇందులో వక్ఫ్ బై యూజ్ అనే పదాన్ని తొలగించింది కేంద్రం. దీని ప్రకారం దీర్ఘకాలంగా ఉపయోగంలో ఉన్న ఆస్తులను వక్ఫ్‌గా గుర్తించడం ఇకపై సాధ్యం కాదని.. తద్వారా ఆస్తి తగాదాలకు పరిష్కారం లభిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. అటు.. సర్వే అధికార పరిధిలోనూ మోదీ సర్కార్‌ మార్పు చేసింది. వక్ఫ్ ఆస్తుల సర్వే బాధ్యతను సర్వే కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్‌ లేదా నియమిత అధికారికి మార్చుతూ నిర్ణయం తీసుకుంది. 

ఇవేకాకుండా.. బోహ్రా, అగాఖని ముస్లిం సమాజాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేసేలా చట్టం రూపొందించింది. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కేంద్రీకృత డిజిటల్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. మరోవైపు.. మ్యూటేషన్ ప్రక్రియలోనూ మార్పు చేసింది ప్రభుత్వం. వక్ఫ్ ఆస్తులను రికార్డులో నమోదు చేసే ముందు సంబంధిత వ్యక్తులకు తెలియజేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వక్ఫ్ ట్రైబ్యునల్స్ పునర్వ్యవస్థీకరణ ద్వారా ట్రైబ్యునల్‌లో జిల్లాస్థాయి కోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న అధికారి సభ్యులుగా ఉండనున్నారు. ఇక.. వక్ఫ్ ట్రైబ్యునల్ తీర్పుపై 90 రోజుల్లో హైకోర్టులో అప్పీలు దాఖలు చేసే అవకాశం కూడా ఈ చట్టం ద్వారా కల్పించింది కేంద్రం. వక్ఫ్ చట్టం పేరును.. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ చట్టం, 1995’గా మార్చింది కేంద్ర ప్రభుత్వం.

అయితే.. దీనిపై ముస్లింలు మండిపడుతున్నారు. ముస్లిం సమాజానికి హాని కలిగించే ఈ చట్టాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. భారత దేశంలోని పౌర సమాజానికి రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందంటున్నారు ముస్లిం మతపెద్దలు. దేశ వ్యాప్తంగా ముస్లిం మైనార్టీల ఆస్తులకు రక్షణగా ఉన్న భూముల ఆస్తులన్నింటినీ 8 లక్షల 72 వేల కోట్లుగా గుర్తించి ప్రత్యేక వక్ఫ్ చట్టాన్ని రాజ్యాంగం అమలు చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. తమ వర్గాన్ని అణగదొక్కడంతో పాటు.. ఆస్తులను లాక్కునేందుకే బీజేపీ ఈ కుట్రలు చేసిందని ఫైరవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు అనేక చట్టాలను బీజేపీ అమల్లోకి తెచ్చిందిన చెబుతున్నారు. ఇప్పుడు వక్ఫ్‌ చట్టంలో సవరణలు చేయడం ద్వారా.. కార్పొరేట్‌ శక్తులకు తమ ఆస్తులను కట్టబెడతారని అంటున్నారు. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని.. ముస్లింల స్వతంత్రతను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ వర్గం నేతలు, మతపెద్దలు.  

 

 

వీటితో పాటు మైనార్టీ నేతలు మరో వాదన కూడా వినిపిస్తున్నారు. హిందూ ఆలయ ట్రస్టుల వంటి కొన్ని సంస్థలు, వ్యవస్థలు, ఆశ్రమాలు స్వతంత్రంగానే నిర్వహిస్తున్నారని అంటున్నారు. మరి అలాంటప్పుడు తమపైనే ఎందుకు ఈ ఆంక్షలు అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వక్ఫ్‌ చట్టం ద్వారా కొన్ని ఆస్తులను టార్గెట్‌ చేసుకునే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సవరణలను రూపొందించేటప్పుడు కూడా కేంద్రం తమను సంప్రదించలేదని.. తాము వ్యక్తం చేస్తున్న అనుమానాలపై కనీసం సమాధానం కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను హరించడమేనన్నది ముస్లిం మైనార్టీల ఆరోపణ. రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కులను కూడా వారు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టికల్ 26 ప్రకారం.. మతపరమైన వర్గాలకు ఆస్తి నిర్వహణ సహా వారి సొంత వ్యవహారాలను నిర్వహించే హక్కు ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా.. వారి సొంత సంస్థలను స్థాపించడానికి.. వాటిని నిర్వహించడం వంటి హక్కులను ఆర్టికల్ 30 కలిగిస్తోందని తమ వాదనలను వినిపిస్తున్నారు. రాజ్యాంగం తమకు ఇచ్చిన ఇలాంటి హక్కులను తుంగలో తొక్కుతూ.. బలవంతంగా ఒక చట్టాన్ని అమలు చేయడం సరికాదని అంటున్నారు ముస్లిం మైనార్టీ నాయకులు.

ఇందులో భాగంగానే వక్ఫ్‌ సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ కొందరు ముస్లిం మైనార్టీ నేతలు కోర్టుకు వెళ్లారు. ఈ చట్టం వక్ఫ్‌ ఆస్తులు, వాటి నిర్వహణపై ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. త్వరితగతిన విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును వారు కోరారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. త్వరిగతగతిని విచారణ చేపట్టాలన్న విజ్ఞప్తిపై అసహనం వ్యక్తం చేసింది. కేసులను అత్యవసరంగా విచారించాలని కోరుతూ పంపే రాతపూర్వక అభ్యర్ధనలు లేదా ఈ-మెయిల్స్‌ వంటి వాటిని పరిశీలించేందుకు ఒక పద్దతి ఉందని.. కోర్టు దాన్నే అనుసరిస్తుందని వ్యాఖ్యానించారు జస్టిస్‌ ఖన్నా. ప్రధాన న్యాయమూర్తి మొత్తంగా పరిస్థితులను సమీక్షించి, ఆయా కేసులను బెంచ్‌లకు అప్పగిస్తారని స్పష్టం చేశారు. ఇవన్నీ చూసేందుకు ఇప్పటికే ఒక వ్యవస్థ అమల్లో ఉండగా.. మీరెందుకు ప్రస్తావిస్తున్నారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ను సైతం ప్రశ్నించారు జస్టిస్‌ ఖన్నా.  

* అనంతరం.. ఏప్రిల్‌ 25న సుప్రీంకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం.. కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం అమలుపై పాక్షికంగా లేదా పూర్తిగా స్టే విధించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని  సుప్రీంకోర్టుకి తెలిపింది. ఇలాంటి కేసుల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చట్టబద్ధమైన నిబంధనల్ని నిలిపేసే అధికారం కోర్టులకు లేదని, చట్టంలో అలా లేదని ప్రభుత్వం వాదనలను వినిపించింది. ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ సిఫార్సులపై చట్టాన్ని రూపొందించామని, ఆ తర్వాత పార్లమెంట్‌ ఉభయ సభల్లో విస్తృత చర్చ జరిగిందని సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది. 

ఇలా కొందరు మైనార్టీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లడంపై మండిపడుతున్నారు బీజేపీ నేతలు. వీటిని ఓట్ బ్యాంక్ రాజకీయాలంటూ కమలం పార్టీ ఎద్దేవా చేసింది. ఓటు బ్యాంకు ప్రయోజనాలను కాపాడుకోవడంతో పాటు.. దేశంలో కొంత అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా. ఇన్నేళ్లు డబ్బులు తిన్న వాళ్లకే ఈ చట్టం ఇబ్బందిగా మారిందని చెప్పారు. కొందరు వక్ఫ్‌ ఆస్తులను ఆక్రమించుకొని.. ప్రయోజనాలు పొందారని.. అలాంటి వారు ఈ చట్టాన్ని విమర్శిస్తారని ఫైర్‌ అయ్యారు. ఎవరైతే వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తున్నారో.. వారి వెనుక కాంగ్రెస్‌, ఎంఐఎం ఉన్నాయని షెహజాద్‌ పూనావాలా విమర్శించారు. 

నిజానికి ఇది.. ముస్లింలకు ఎంత మాత్రం వ్యతిరేకం కాదన్నది షెహజాద్‌ పూనావాల వాదన. దీని వల్ల ముస్లిం మైనార్టీలోని పేదలకు మేలే జరుగుతుందని ఆయన చెబుతున్నారు. కొత్త చట్టం వల్ల సామాజిక న్యాయం సహా.. వక్ఫ్‌ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా.. సక్రమంగా నిర్వహించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. దీన్ని హిందూ-ముస్లిం మతాలకు ఎందుకు ముడిపెడుతున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని పలు ముస్లిం సంస్థలతో పాటు.. క్రైస్తవ సంస్థలు కూడా స్వాగతించాయని ఆయన గుర్తుచేస్తున్నారు. 

ఇద్దరి వర్షన్‌లు వింటున్న సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి తీర్పు వెలువరించే అవకాశముంది..! దానిపై ప్రభుత్వం, ముస్లిం నాయకులు ఎలా రియాక్ట్‌ అయ్యే ఛాన్స్‌ ఉందన్నదే ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఒకవైపు ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనం అంటుంటే.. మాపై మీ పెత్తనం ఏంటంటోంది మైనార్టీ వర్గం..! కానీ.. దీన్ని సామరస్యంగా పరిష్కరించాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వంపైనే ఉందంటున్నారు కొందరు పరిశీలకులు. సమాజంలోని ఆందోళనలను తగ్గిస్తూనే.. ఆయా వర్గాల్లోని పేదలకు న్యాయం చేయడం కూడా అవసరమని చెబుతున్నారు. అవసరమైతే.. మరోసారి మైనార్టీ వర్గాలతో సంప్రదింపులు జరిపి.. ఈ వివాదాస్పద సమస్యకు త్వరగా ముగింపు పలకాలని కోరుకుంటున్నారు మేధావులు, దేశ ప్రజలు.